Friday, September 3, 2010

సూదంటురాయిలా...

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికెగిరే రాకెట్లా
నేను అంతరిక్షం వైపు
దూసుకు పోతున్న వేళ...
అన్ని దిక్కుల్లోనూ
నువ్వే కనిపించావు
ఆనాడు నీ నగుమోము
సూదంటు రాయిలా
నన్ను ఆకర్షించింది
ఏదో శక్తి ప్రబలమై ఆవహించింది
గురుత్వాకర్షణను మించిన
ఆ సమ్మోహన శక్తి
నన్ను అమాంతం ఆకట్టుకుంది
రెట్టింపు వేగంతో
నేనిపుడు
భూమికి దూసుకొస్తున్నాను...
నన్నింతగా ఆకర్షించిన
నీవు నాకిపుడు కనిపించవేం?
రాలిన ఉల్కా శకలంలా
తెగిన గాలిపటంలా
నేలకు ఉరికివస్తున్న
నాకు ..
దారమైనా ఆధారమైనా
నీవేనన్న సంగతి ఆదమరిస్తే
ప్రియతమా నాకేదీ గతి...
ఆకర్షణతో లాగేసి...
ఆశ్రయం ఇవ్వకుండా
వదిలేస్తే...
ఏ అధో పాతాళానికి.
జారిపోతానో అని
భయంగా ఉంది....
మరి... కరుణిస్తావా...
చేయందిస్తావా?!
               - దీక్షిత్

Monday, August 30, 2010

నేనెవర్ని?

ప్రియా...
నన్ను చూసిన తొలి క్షణంలో
నీ కళ్ళలో
మెరిసిన ఆనందవీచిక
నాతో మాట్లాడే ప్రతి నిమిషం
నీలో కనిపించే ఉత్తేజం
నాతో ఉన్నపుడు
వెల్లివిరిసే ఆత్మీయత
ప్రేమను కొసరే ఆప్యాయత
ఇవన్నీ చూస్తుంటే...
నేను నీవాడినని
నమ్మకంగా అనిపిస్తుంది...
అంతలోనే...
ఎందుకో
నన్ను ఎడం చేస్తున్నావనిపిస్తుంది
చుట్టంలా చూస్తున్నావని తోస్తుంది
నువ్వు నాకు దూరమౌతావన్న
భయం నన్ను ఆవహిస్తుంది
అదే జరిగితే...
ఆ ఊహే భయానకంగా తోస్తుంది
బతకాలన్నవాంచ నశిస్తుంది
ప్రియతమా...
అతిథులు...
హితులు, స్నేహితులూ
ఎందరో ఉంటారు....
నేనూ అందర్లో ఒకడ్నా...?
అనే అనుమానమూ వేధిస్తుంది
మరు తరుణంలోనే
నేను నీకో ప్రత్యేకమైన వ్యక్తినని
విశ్వాసం కలుగుతుంది
ప్రియతమా...
సొంత మనుషుల మధ్య
ఎందుకీ అంతరం?
నా మనో మందిరంలో
నువ్వో దేవతవైనప్పుడు
కనీసం నీ పాదాల చెంతనైనా
నాకు చోటుండదా ??

తెల్ల గులాబీ

నా మనసు పూదోటలో
వెల్లి విరిసింది ఓ తెల్ల గులాబీ
ఆ సుగంధాలకు
గులామ్ నై
కడ్తున్నా మెరూన్ మాలల్ని
ఇస్తున్నా సలామ్ సుమాల్ని
ఆ సాన్నిధ్యం
నాకొక దివ్యానుభూతి
ఆ పరిమళంలో
అనిర్వచనీయ శాంతి
అందం... సౌకుమార్యం
అన్నిటినీ మించిన
ఆ పూరేకుల తెల్లదనం
ఆ స్వచ్చతలోని ప్రశాంతత
ఆ మెత్తదనంలోని మమకారం
ఆ దగ్గరితనంలోని ఆత్మీయత
లాలిత్యానికి మారుపేరైన ఆడతనం
అభిజాత్యం చూపే జాణతనం
తాజాదనంలోని ప్రేమగుణం
అన్నీ కలగలిసిన ఓ అద్భుతం
ఆమెతో నా అనుబంధం
అదో అందమైన అనుభవం
                        - దీక్షిత్