Friday, February 4, 2011

ఎక్స్ క్యూజ్ మీ బాస్


పగిలిన అద్దం ముక్కల్ని ఏరుకుంటున్నా... ఒక్కో ముక్కకి ఒక్కో ముఖం వాటన్నిటికీ అభిముఖంగా ఎన్నో ముఖాలు కట్ చేస్తే ఎదురుగా నాకన్నా కొత్త దనంతో ఆలోచించే రాము. ఎస్ వాట్ ఐయాం సేయింగ్ ఇట్స్ వెరీ క్లియర్ అని నమ్మి ప్రయాణించే (అభి)వ్యక్తి రాము. అందుకే అతడికి దెయ్యం, భూతం, యజ్ఘోపవీతం ఇవన్నీ అతడికి సాధారణ విషయాలు. ఎటువంటి పార్లాక్స్ దోషాలు లేనటువంటి విషయాలు. అప్పటివరకూ పాతుకుపోయిన, బూజు పట్టిన ఫీలింగ్స్ ను కిక్ చేస్తూ అవసరమొస్తే కరణ్ జోహార్ ను విమర్శిస్తూ, అవసరం ఉన్నా, లేకున్నా వార్తల్లోకెక్కే నైజాన్ని పదునెక్కిస్తూ ఎదిగే శక్తి రాము. అతడికి శూన్యం నుంచి శబ్దాన్ని, శబ్దం నుంచి నిశ్శబ్దాన్ని మలచడం వచ్చు. ఎవరైనా విలేకరి "మీకు ఫలానా హీరోయిన్ తో లింక్ ఉందట" అని అడిగారనుకోండి "హీరోయిన్లంతా నా అక్కా చెల్లెళ్ళండి" అనే కామెంట్ ను విసిరి పారేస్తాడు. పోనీ అలా అని తను అన్న మాట మీద నిలబడతాడా అంటే కాదు. శ్రీదేవిని శృంగార రసాధి దేవతగా కీర్తిస్తూ తన రాణీని బోనీ ఎగరేసుకుపోవడాన్ని సహించలేకపోతూ... అప్పుడప్పుడూ తన దురదృష్టాన్ని ప్రస్తావిస్తూ (బహుశా ! ఇలా అంటే రామూ ఒప్పుకోడేమో !) లైవ్ లైఫ్ కహానీ ఇన్ స్టెంట్ గా చెబుతాడు. ఏది ఏమైనా అతడో పెర్సెప్షనిస్టు. అంతే ! మరో మాట చెప్పను. అతడన్నట్టే కొంతకాలమాగితే వాస్తవాలు రుజువైతే అవి ఎన్నో సిద్ధాంతాలుగా రూపుదిద్దుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వర్మ అనే పోయట్ ని ఎవరూ అంత వేగంగా యాక్సెప్ట్ చేయరు, చేయలేరు. కొత్తల్లో నేనూ అంతే! ఆ నోట... ఈ నోట అతడి గురించి విని తెలుసుకున్నాకా నా అభిప్రాయం తప్పనుకున్నా. అటువంటి వాతావరణం నుంచి తప్పుకున్నా.
   మనిషిలో ఉండే డార్క్ నెస్ అంటే అతడికి ఇష్టం. దాన్నే వెలుగులోకి తీసుకొస్తుంటాడు. పదే పదే చెప్పిందే చెప్పి తల బొప్పి కట్టించకపోవడం అతడి నైజం. అందుకే అతడంటే మామూలు జనాలకు కూడా అంత ఇష్టం. " నా జీవితంలో చేసిన పెద్ద తప్పు షోలే ని రీమేక్ చేయడం, మరెప్పుడూ క్లాసిక్స్ జోలికి పోను అని ఘంటాపదంగా చెప్పగలడు. అవసరమనుకుంటే ఆచరించగలడు, లేదంటే లేదు. ఆవిధంగా చెప్పి కూడా తనదైన వేలో కన్విన్స్ చేయగలడు. ఎలా అంటారా... " మీరు ఓ పుస్తకాల షాపుకి వెళ్ళారనుకోండి. అక్కడ పోయెట్రీ, క్లాసిక్స్, కామిక్స్ ఇలా అన్నీ ఉంటాయి. అక్కడ ఎవరికి ఏది నచ్చితే అదే కొనుక్కుంటారు. అలానే నా సినిమాలు కూడా ! నచ్చడం, నచ్చకపోవడం మీ ఇష్టం" అంటూ భావోద్వేగాలను అండర్ కరెంట్ గా ప్లే చేయగలడు. ఆ విధంగా అతడో ప్లేయర్. అతనికి (కరణ్) జోహార్ ఒక జోకర్. తన ఓటమికి తానే బాధ్యుడ్నని నిర్మొహమాటంగా ప్రకటించుకోగలడు. వాస్తవానికి ఈ పెర్సెప్షన్ డైరెక్టర్ అవ్వాలి అని కలలుగంటున్న రోజులనుంచీ ఉంది.
        నగరానికి దూరంగా ఓ అపార్ట్ మెంట్. అందులో కొత్తగా పెళ్ళైన జంట ఫ్లాట్ తీసుకుని అడుగిడితే అక్కడో దెయ్యముంటే ఏంటి కథ. ఈ థాటే పన్నెండో అంతస్థు. అప్పటి వరకూ కలిసి పనిచేస్తున్న అమ్మాయిపై భార్యకు అనుమానం. దీంతో ప్రతిరోజూ అతడ్ని సాధిస్తుంటుంది. అరిచి గోల చేస్తుంటుంది. ఈ ఎమోషన్ కు వెక్స్ అయిపోయిన హీరో ఆమెపై చేయి చేసుకుంటే... ఆమె చనిపోతే ఏంటి కథ అన్నదే " మధ్యాహ్నం హత్య". బెజవాడ రౌడీలు అంటే మీకు కోపమొచ్చింది. కాదనను. మరి ! బెజవాడ గాంధీలు అంటే నా సినిమాకు కలెక్షన్లు తెచ్చి పెడతారా ! అని సూటిగా ప్రశ్నించగలడు.
కట్ చేస్తే....
మన వీధుల్లో దొమ్మీ ఏ విధంగా ఉంటుందో అదే రామూ ఫైట్. మనం ఏది మాట్లాడుకుంటామో అదే రామూ డైలాగ్. మనం ఎలా యాక్ట్ చేస్తామో అదే రామూ డైరెక్షన్. మనం ఏవిధంగా సంభాషించుకుంటామో అదే అతని పాట. తన మీద తాను సెటైర్ వేసుకున్నా, రాఘవేంద్రరావు వంటి సీనియర్ల మీద సెటైర్ వేసినా అదంతా ఆ... జీవికే.. ఆర్ జీవీకే చెల్లు.

సో.. ఇప్పుడు రాము మనకి డైరెక్టర్ కాదు. రాము మనకో వాక్యం (నా ఇష్టం పేరుతో పుస్తక రూపంలో అట్టహాసం చేశాడు గనుక.) ఓ బ్రాండ్ అంబాసిడర్. బిగ్ పిక్చర్స్, సహారా వంటి సంస్థలకు అతడో "కంపెనీ". మొత్తమ్మీద మనందరినీ తన ఆలోచనలతో తనదైన స్పేస్ లోకి తీసుకెళ్ళే రాడార్. ఒక్కసారి ఆ... విండో తెరిస్తే .. ఒక్కసారి ఆ... డోస్ తీసుకుంటే.... ముంబయి మురికివాడలు... దావూద్ ఇబ్రహీంలు, శ్రీదేవి లాంటి శృంగార నాయికలు.. నగ్న పాదాలతో నడిచే రైఫిళ్ళు... నిజాలు... పెర్సెప్షనిజాలు... రంగీలాలు.... అట్టర్ ఫట్ అయిన ఆగ్ లు... ఇంకా కొన్ని కలల రీళ్లు ఈస్తటిక్ సెన్స్ లో గిర్రుగిర్రుమని మీచుట్టూ చక్కర్లు కొడుతుంటాయి. ఆ... ప్రపంచానికి రామూయిజంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆర్ యూ రెడీ.
పీ.ఎస్.
ఎక్స్ క్యూజ్ మీ బాస్ వుడ్ వియ్ షేర్ యువర్ ఫీలింగ్స్ వితౌట్ ఎనీ హిపోక్రసీ. (ప్లీజ్! పెర్మిట్ అజ్)
ఇలా అంటే నన్ను అర్ధం చేసుకోవడం, చేసుకోకపోవడం మీఇష్టం అని లక్షా తొంభయ్యోసారి చెబుతాడేమో!
ఇలా ఎన్నిసార్లన్నా
ఏ అభిమాన సంఘాలూ లేని రాము
నిష్టుర "సత్యం"ను చెప్పే రాము
అందమైన అబద్ధం చెప్పే రాము
అవార్డులంటే అసహ్యించుకునే రాము
మనకు వద్దన్నా తలంపులోకి వస్తాడు. బాస్ తిట్టినప్పుడో.... సర్ర్ మని వెళ్తున్న కారు బురదనీటిని షర్ట్ మీద తుళ్ళించినపుడో.... వీరావేశాలతో మనకు ఫలానా వారంటే అభిమానమని చెప్పినపుడు సముదాయిస్తాడు. ఇది కరెక్ట్ కాదు కన్నా! అని చెబుతాడు.
ఇంకెందుకు ఆలస్యం.
హేవ్ ఎ "కంపెనీ" విత్ రామ్ గోపాల్ వర్మ.
... "నా ఇష్టం" చేతికి చిక్కాక.

                                                                 - శంభుమహంతి రత్నకిషోర్