ప్రేమ కవితలు

నివేదన

ఎందుకో...
ఈ పున్నమి రాత్రి
చందమామ చిన్నబోయింది!
ఆకాశమంత అంధకారం
రేయంతా రాజ్యమేలింది
వసంతం కాస్తా శిశిరంగా మారి
ఆశల చివుళ్ళను నిర్దాక్షిణ్యంగా
రాల్చి పారేసింది
గోదావరి తన గుసగుసలు మాని
మౌనాన్ని ఆశ్రయించింది!
చుట్టూ ఎందరున్నా...
నన్ను ఒంటరితనం ఆవహించింది
మదిలోని విచారంతో
బరువెక్కిన కాలం
ఎంతమాత్రం కదలనంటోంది
నీ వియోగం తాళలేక
నా బ్రతుకే భారంగా మారింది
ప్రియతమా !
ఎందుకీ శోధన....
అర్ధం కాలేదా నా హృదయ (ని)వేదన ?
                                  -దీక్షిత్

Wednesday, August 18, 2010

ఆ క్షణం...

నువ్వూ నేనూ
అడుగులో అడుగేసుకుంటూ...
ప్రపంచం అంచుల వరకూ
ఈ కృత్రిమత్వ కరాళ నృత్యానికి సుదూరం వరకూ
చేయి చేయి పట్టి నడిచిన
ఆ క్షణం ఎంతో బాగుంది కదూ....
ప్రకృతి ఒడిలో మనం పవళించిన రోజు
మన ఇద్దరి తనుహృదయాలు పరవశించిన రోజు
భాషకందని ఆత్మీయత మనలను ఆవహించిన రోజు
ఎల్లలెరుగని తన్మయత్వం ఆలింగనం చేసుకున్న రోజు
ఆరోజు...
ప్రియతమా... ఓహ్ ఇంకా ఎంతో బాగుంది కదూ....
నువ్వూ నేనను మాట మరచి
మనమై కలిసిమెలిసిన ఆ అపూర్వ క్షణం.....
ప్రేమకాంతి నింపిన సూర్య కిరణం
హద్దులను మసి చేసిన అగ్నికణం
మన(సు)లను ఒకటి చేసిన మధుర తరుణం
నా మజిలీ ఇదని దోవ చూపిన స్వాగత తోరణం
ప్రియతమా....
నిజంగానే ఎంతో బాగుంది కదూ...
                                        -దీక్షిత్

నీ కోసం...

 రేయి ఎందుకింత సుదీర్ఘం...
హృదయమా...
క్షణమొక దినంగా... నీవు లేని దినమొక యుగంగా
భారంగా సాగుతున్న వేళ...
ఏదో క్షణంలో నీ గొంతు వినాలని,
నీ పలకరింపుతో మెరిసి మురిసిపోవాలని
నా మనసు ఆర్తిగా తపిస్తుంటే...
ఆ శుభోదయం కోసం నేను స్మరిస్తుంటే...
ఎంతకీ కదలదేం ఈ రేయి?
ధాత్రి ఇంకా రాత్రి దుప్పట్లోనే
ముసుగుతన్ని పడుకుంది
నేను మాత్రం ఈ నిశీధిలో
కునుకు కరువై  వేకువ కోసం
వేచి చూస్తున్నా...
ప్రియ సమాగమాన్ని కూర్చే
ఆ తొలి వేకువ కోసం అలాగే
వేయికళ్ళతో వేచా...
తలవాకిట తలవాల్చి నిలిచా...
కటిక నిశిరాత్రి సైతం తల వంచేలా...
నా కళ్ళే చిరుదీపాలుగా వెలిగించుకుని...
నా హృదయాధిదేవతకు దీపారాధన చేస్తూ....
అనంత విశ్వంలో
ఓ అలుపెరుగని యాత్రికునిలా
ప్రియతమా వేచిఉన్నా
నీ కోసం....
       -దీక్షిత్

Tuesday, August 17, 2010

నువ్వు కావాలి


ప్రియతమా...
చిరునవ్వులు కురిపిస్తావని...
బిగి కౌగిట బంధిస్తావని...
నులివెచ్చని ముద్దిస్తావని...
నీ ఒడిలో చోటిస్తావని...
ఎంతగానో ఆశించాను....
కానీ నువ్విలా...
కరుణ లేని రాయిలా
నన్ను వీడి వెళతావని
కలలో కూడా అనుకోలేదు... ఆ కలలో కూడా
ఈ బాధను భరించలేను
నువ్వు లేని ఈ చోటు
నాకొక నరకంలా ఉంది
నీకోసం వెదికి వేసారిన కళ్ళు
తడి ఇంకిన ఎడారి బయళ్ళు
నీ పలకరింపు కోసం
తపిస్తున్న నా హృదయం
దహిస్తున్న పెనుగాయం
నీ ఆత్మీయత
నీ అనురాగం
నీ స్పర్శలోని సాంత్వన
అన్నీ కావాలి....
నీ నవ్వు కావాలి
నీ సాన్నిధ్యం కావాలి
నాకు నువ్వు కావాలి
అవును నువ్వే కావాలి ....
                    -దీక్షిత్

Monday, August 16, 2010

పరిపూర్ణ వనిత

మమకార మధురిమలు పొంగు
మధుర సుధాభరిత
ఆత్మీయతకు ప్రతిరూపమైన
నిశ్చల విమల చరిత
ఎల్లలెరుగని మధురోహలకు
పొంతన కూర్చు కవిత
చిలిపిదనపు పరవళ్ళలో
కాంచవచ్చు గోదావరి తుళ్ళింత
రస హృదయాలకు లేదు చింత
ఈ పడతి నవరస భావనల సంత
పసిడి అందాల ఈ భరిణె చెంత
యువహృదయాలకు తప్పదు గిలిగింత
ఆప్యాయతానుబంధాల చందన భరిత
అందాల సిరిగంధాల పూత...
ఆత్మ సౌందర్యపు కలనేత..
నైతిక విలువల కలబోత
ఆధునికతకు ప్రతీక, స్వేచ్చకు ఎత్తిన పతాక
ఈమె ఒక పరిపూర్ణ వనిత
                                  -దీక్షిత్