Saturday, October 8, 2016

స్వచ్ఛ భారత్ - శిష్టు శాస్త్రి (కొంతమూరు, రాజమహేంద్రవరం)

1. ఆ.వె.
స్వేచ్ఛగా జనమును బెంచుకుంటిమి గాని
స్వచ్ఛమైన ఇంటినుంచమైతి
మందుకే మనకు మందు లేనటువంటి
రోగబాధ కలిగె రూఢి గాను

2. ఆ.వె.
స్వచ్ఛ భారతమును నిచ్ఛతో జేయగ
గాంధి యెపుడొ చెప్పె నదియు మరచి
గాంధి శిల్పములకు ఘనముగా దండలు
వేసి జయమనుచును వీడినాము

3. ఆ.వె.
మనదు భారతమును మన కుటుంబమనుచు
గాంధి మోడి వంటి ఘనులు తలచి
స్వచ్ఛభారతమును తెచ్చిరయ్య నిజము
దీనినాచరించి మనగ మనము

4. ఆ.వె.
స్వచ్ఛభారతమును నిచ్ఛతో జేయగ
మన ప్రధాని మోడి మనకు దెచ్చె
మోడి ఇంట జరుగు పెండ్లి కాదిదియయ్య !
భరతభూమి శుభ్రపరచునయ్య !

5. ఆ.వె.
స్వచ్ఛత యనునదియె సంస్కృతి చిహ్నము
స్వచ్ఛతున్న యెడల సంపదదియె
స్వచ్ఛత కఱవైన స్వేచ్ఛ యెందుకు తండ్రి !
స్వచ్ఛ భారతాన స్వస్థుడగును !

6. ఆ.వె.
స్వచ్ఛభారతమని శ్రద్ధగా పెద్దలు
వచ్చి సేవ జేయ వరము గాదు
మనకు మనమె స్వచ్ఛమైన సంస్కృతి తోడ
శుభ్రపరచుకొనిన శుభము కలుగు