Friday, August 27, 2010

ఎప్పటికైనా...

నేస్తమా..
నీ గురించి
నేనెన్ని సార్లు తలచుకున్నానో
నీ గురించి
నేనెంతగా ఎదురు చూశానో,,
ఎలా చెబితే
నీకు అర్ధం అవుతుంది?
నిన్ను తలుస్తూ
ఊహల అగాధంలోకి
నేనలా జారి పడిపోయిన వేళ
నన్ను నేను మిస్సయిన విషయం
నీకెలా అవగతమయ్యేది ?
నిన్ను పదేపదే
గుర్తు చేస్తున్న నా మదిని
మరల్చేందుకు...
ఆకాశంలో చుక్కల్ని సైతం
లెక్క పెట్టిన విషయం
నీకు తెలిసేదెలా...
చుక్కల లెక్క పూర్తైనా
అనంతమైన నీ ఊసులు మాత్రం
నన్ను వీడలేదని
అసలెన్నడూ
అవి నా మదిని వీడిపోవని
నీకు ఇప్పటికైనా తెలుస్తుందా..
అసలెప్పటికైనా తెలుస్తుందా....??
                            -దీక్షిత్

Wednesday, August 25, 2010

కలలో కూడా...

ప్రియతమా...
కలలో కూడా
ఊహించలేని
అదృష్టాన్నిచ్చావు
నీ స్నేహ పరిమళంతో
నన్ను పరవశింపజేశావు
నీ అనురాగంతో
నాకొక
కొత్త జీవితాన్ని ప్రసాదించావు
నీ చెలిమితో
ఈ శిలను
శిల్పంగా మలిచావు
హృదయమా...
కలలో కూడా
ఈ అదృష్టాన్ని దూరం చేయకు
కలలో కూడా
నన్ను వీడి వెళ్ళకు
కలలో కూడా
నన్ను మళ్ళీ శిలగా మార్చేయకు
చివరికి...
కలలో కూడా
ఈ జీవితాన్ని కాలరాయకు
                                     - దీక్షిత్

Tuesday, August 24, 2010

నీవల్లే...

ఒకవేళ...
ప్రేమంటే ఏమిటో
నాకు తెలిసిందీ అంటే
అది నీవల్లే
ఒకవేళ
మనసు భాష నాకు
తెలిసొచ్చిందంటే
అది నీవల్లే
ఒకవేళ
ఎదుటి వ్యక్తిని
అర్ధం చేసుకోవడం
అలవడిందంటే... నీవల్లే
అందమైన భావుకతకు
అపురూపమైన భావనలకు
అలవి కాని ఆశలకు
అంతులేని ఆవేశానికి
అర్ధం లేని కోపానికి
హద్దుల్లేని ప్రేమాభిమానాలకు
దేనికి నే గురైనా....
నేనెలా ప్రవర్తించినా...
ప్రియతమా...
అది నీవల్లే
ఎందుకంటే
ఈ క్షణం నుంచి
నేనంటూ లేను
నువ్వే నా సర్వస్వం
నువ్వే నా సమస్తం
నువ్వే నా ఆద్యంతం
                - దీక్షిత్

Monday, August 23, 2010

"కిరి కట్"

ఆ రోడ్డు మీద
వయోలెన్సీ కుర్రాళ్ళు
ధర్మదేవత
నాలుగు పాదాలూ
విరిచి
మూడింటిని వికెట్లుగా
మిగిలిన ఒకటిని
బ్యాట్ గా చేసి
సమాజాన్ని
"చెలగాటం" అనే
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు
                      - ఆకొండి రవి, కాట్రేనికోన

అపురూపం

నేను చాలా చాలా
అదృష్టవంతుడ్ని సుమా
ఈ ప్రపంచంలో మహా గొప్పవి...
ఎంతో అందమైనవి...
మరెంతో ఉన్నతమైనవి...
ఎన్నో ఉన్నా
వాటిని ఊహలో పొంది తృప్తి పడాలే తప్ప
తాకే అర్హత.. చూసే అదృష్టం కూడా లేదు
అది వెన్నెల్లో తాజ్ మహల్ కావచ్చు...
మానస సరోవరంలో రాజహంస కావచ్చు
కోహినూర్ వజ్రం కావచ్చు
లేదంటే చందమామలోని కుందేలు కావచ్చు
కానీ...
ఆ కోవకే చెందిన నువ్వు
నా మనిషిగా మసిలిన
ఆ అపురూప క్షణాలు
నాకొక జీవితకాలపు
అద్భుతాన్ని పంచాయి
మరో జన్మకు సరిపడా
తీయటి అనుభూతి మిగిల్చాయి
నీ స్పర్శలో వెచ్చదనం
నీ సాన్నిధ్యంలో ఆనందం
నీ మాటలోని మార్దవం
నీ మనసులోని మంచితనం
నీవు పంచిన ప్రేమగుణం
నీవు చూపిన మమకారం
నీలోని ఆత్మీయత
నీదైన అనురాగం....
ఇవన్నీ నాలో
సదా సజీవంగా నిలుస్తాయి
ఎప్పటికప్పుడు నన్ను ఉత్తేజపరుస్తాయి
ప్రియతమా ....
నువ్వు
నా దానివని గుర్తు చేస్తాయి
నువ్వెంతటి అపురూపమో
నా మనసుకు తెలియ పరుస్తాయి
మన బంధమెంతటి
అతిశయమో...
ఈ గుర్తులు వివరిస్తాయి
                   -దీక్షిత్

Sunday, August 22, 2010

మజిలీ

ప్రియతమా...
అందమైన ప్రకృతి కాన్వాసు మీద
అరుదైన రంగులద్దినట్టుగా ఉంది
నిన్ను చూస్తుంటే...
ఈ ప్రపంచానికి నువ్వు కేవలం
ఓ వ్యక్తివి కావచ్చు
కానీ నిన్నే ప్రేమించే నాకు
నువ్వే ప్రపంచమయ్యావు
ఆశలు రేపావు, ఆలోచన నేర్పావు
జీవితంపై అభిలాష పెంచావు
అడుగడుగునా స్ఫూర్తివై నిల్చావు
కొన్నాళ్ళ క్రితం
నాకేమీ కాని నువ్వు
ఇవాళ అన్నీ అవుతుంటే
ఎందుకో ఒకింత ఆశ్చర్యంగా ఉంది
ఇంతలోనే ఏమిటీ వింత.. అనిపిస్తోంది
ఇలా ఆలోచిస్తున్న
నా మనసుకు అంతలోనే
ఒక జవాబు స్ఫురించింది
అనంత విశ్వంలో..
సుదీర్ఘ యానంలో
ఎన్నెన్నో జన్మల మజిలీల మధ్య
ఎక్కడో, ఎప్పుడో...
నువ్వు నాకు తారసపడే ఉంటావని
ఆ రుణబంధమే
నేటి అనుబంధమని !
                   -దీక్షిత్